DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రం లోని గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరగతులలో పగిలిన గుంతలను వెంటనే పూడ్చాలని, విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సన్నీ గౌడ్ మాట్లాడుతూ ..... గత రెండు సంవత్సరాలుగా గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని తరగతి గదుల్లో ఫ్లోర్ అంతా దెబ్బతిన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తరగతిగదుల్లో ఫ్లోర్ కి గుంతలు ఏర్పడడంతో పాములు వచ్చి పడుకుంటున్నాయని, కొన్ని సందర్భాల్లో పాముల నుంచి తప్పించుకునే క్రమంలో పలువురు విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పనకై జిల్లా కలెక్టర్ గారు బాధ్యతలు నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో స్పందించిన విద్యాశాఖ అధికారులు ఎంఈఓ పోశయ్య ని ఆందోళన జరిగే పాఠశాలకు పంపించగా వారు 15 రోజుల్లో పాఠశాల సమస్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సిద్ధార్థ, విగ్నేష్, చరణ్, నవీన్ పిడిఎస్యు జిల్లా నాయకులు రాహుల్, తిరుపతి, వంశీ, రాజ్ కుమార్, విధ్యార్ధులు పాల్గొన్నారు.

