DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చేసిన నిర్లక్ష్యం వల్ల అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... ఓ గర్భిణి ప్రసవం కోసం ఇటీవల ఆసుపత్రికి రాగా విధుల్లో ఉన్న వైద్యురాలు మంగళవారం రాత్రి శస్త్రచికిత్స చేసింది. కొద్ది నిమిషాల తేడాతో మరో గర్భిణికి సైతం శస్త్రచికిత్స చేయగా ఒకరికి ఆడ, మరొకరికి మగ బిడ్డ జన్మించారు. అయితే ఓ బాధితురాలకు ఆడ బిడ్డ పుడితే మగ బిడ్డని ఇవ్వడం ఏంటని ఆందోళన మొదలైంది. బాధిత కుటుంబసభ్యులను సముదాయించినా వినకపోవడం.. ఆసుపత్రిలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. చివరకు బాధిత తల్లి తనకు ఆడ శిశువే జన్మించింది అని చెప్పినా నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు. చివరన.. వైద్యురాలిని వివరణ కోరగా సిబ్బందికి వివరాలు తెలిపి సరిగ్గానే శిశువును ఇచ్చి పంపించానని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అనంతరం ఆసుపత్రి పర్యవేక్షణాధికారి హరిశ్చంద్రారెడ్డిని వివరణ కోరగా డీఎన్ఏ పరీక్షతో నిర్ధారణ చేసి పిల్లలను అప్పగించడం జరిగింది.

