DIGITAL MANCHERIAL NEWS:- నిన్న రాత్రి మందమర్రి టోల్ గేట్ దగ్గర జరిగిన ఘటనపై వివరణ ఇచ్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... మందమర్రి టోల్ గేట్ నిర్వాహకులు నేషనల్ హైవే నియమనిబంధనలకు వ్యతిరేకంగా హై వే మరియు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి కాకముందే ఇష్టానుసారంగా టోల్ గేట్ ప్రారంభించి అమాయక, పేద ప్రయాణికుల దగ్గర నుండి అధిక మొత్తంలో టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని, వసూలు చేసిన టోల్ ఫీజుకు సంబంధించిన సరైన రసీదులు కూడా ఇవ్వడం లేదని, అంబులెన్స్ లాంటి అత్యవసర వాహనాలు వెళ్లుటకు అత్యవసర దారి కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. అదేవిధంగా అక్కడ పనిచేయడానికి స్థానికులను కాకుండా వేరే రాష్ట్రాల వారిని నియమించుకోవడంతో వారు స్థానిక ప్రయాణికులపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తాము నిన్న రాత్రి అక్కడ ఆగి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా సరైన సమాధానం ఇవ్వకపోగా తమతో కూడా దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు స్పందించి టోల్ గేట్ దగ్గర నియమనిబంధనలు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తొంగుల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాత శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, ఇతర కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

