DIGITAL MANCHERIAL NEWS:- విద్యార్థులకు చదువు సంస్కారం నేర్పవలసిన గురువు రెండేళ్లుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఉట్నూరు మండలం లక్కారం జిల్లా పరిషత్తు సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముడుగు శామ్యూల్ తెలిపిన వివరాల ప్రకారం... ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు స్వామి తరగతిలో తమ పక్కన కూర్చుంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 9, తరగతుల విద్యార్థినులు రాత పూర్వకంగా హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. అసభ్యంగా మాట్లాడుతూ వెకిలి చేష్టలు చేస్తున్నాడని అందులో పేర్కొన్నారు. రెండేళ్లుగా ఇలాగే ప్రవర్తిస్తున్నాడని, ఆయనపై ఫిర్యాదు చేస్తే మార్కులు తక్కువ వేస్తాడనే భయంతోనే ఇన్ని రోజులు చెప్పలేకపోయామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలోనూ ఆయన తీరులో మార్పు రాకపోవడంతో ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు హెచ్ఎం వివరించారు. ప్రధానోపాధ్యాయుడి నివేదిక, విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు స్వామిని డీఈవో ప్రణీత సస్పెండ్ చేశారు.

.jpeg)