విద్యార్థులను పరామర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఆహార విషబాధ (ఫుడ్ పాయిజనింగ్)కు గురై సుమారు 20 మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు.




ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలికల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికలకు అత్యుత్తమ వైద్యం అందించాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యులను స్పష్టంగా ఆదేశించారు.




ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు ఫోన్ చేసి మాట్లాడి పరిస్థితిని వివరించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్ పాల్గొని, వసతి గృహ పరిస్థితులు, బాలికల ఆరోగ్య స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే సమీకృత బాలికల వసతి గృహాన్ని సందర్శించి, వంటశాల, భోజన తయారీ విధానం, ఆహార నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ ఘటనకు కారణమైన అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ:

“బాలికల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు. వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. బాధిత బాలికలకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by